మీపై మీకే మోజు పెరుగుతోందా? అది నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(NPD) కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త..!

మీపై మీకు మోజు పెరుగుతోందా? తరచూ అద్దంలో చూసుకుంటూ.. మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటున్నారా? మీ అందం మిమ్మల్ని మోహితుల్ని చేస్తోందా? మగవాళ్లకు ఇలాంటి లక్షణాలుంటే.. తస్మాత్ జాగ్రత్త..! ఈ లక్షణాలు నార్సిసిస్టిక్(Narcissistic) పర్సనాలిటీ డిజార్డర్(NPD) కావొచ్చు. ఇది ఓ మానసిక రుగ్మత. ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులు(ముఖ్యంగా మగవారు) అనూహ్యంగా స్వీయ-ప్రాధాన్యతను కలిగి ఉంటారు. డయాగ్టసిటక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్-5(డీఎస్ఎం-5) ఈ రుగ్మతను అటెన్షన్-సీకింగ్, గొప్ప వ్యక్తిత్వ లక్షణాల డిజార్డర్ అని స్పష్టం చేస్తోంది. ఈ రుగ్మత బారినపడ్డ వారు.. స్వీయ గౌరవానికి సంబంధించి, బాహ్య ధ్రువీకరణ కోసం పాకులాడుతుంటారు. తమను తాము అత్యుత్తమంగా భావిస్తారు. ఈ లక్షణాలు వ్యక్తిత్వ లోపాల(Personality defects)కు దారితీస్తాయి.

ఈ పదం ఎలా వచ్చింది..?

నార్సిసిజం అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. గ్రీకు పురాణాలోల నార్సిసస్ అనే అందమైన యువకుడి ప్రస్తావన ఉంది. నార్సిసస్ ఓసారి నీటి కొలనులో తన ప్రతిబింబాన్ని చూసి, తనలోతాను ప్రేమలో పడతాడు. ఆ తర్వాత క్రమంగా పేరులేని పువ్వుగా మారిపోతాడని ఆ పురాణం చెబుతోంది. అలాంటి లక్షణాలున్న వారికి మానసిక శాస్త్రవేత్తలు నార్సిసిజం పర్సనాలిటీ డిజార్డర్(NPD)తో బాధపడుతున్న వారిగా వ్యక్తీకరించారు. ఈ రుగ్మతతో బాధపడుతున్న వారి వ్యక్తిగత సంబంధాలు సంతృప్తికరంగా ఉండవు. ఎన్‌డీపీతో బాధపడేవారు సామాజికంగా విక్షేపం చెందుతూ.. స్నోబిష్‌గా కనిపిస్తారు. అహంకారం పెరుగుతుంది. భావోద్వేగాలను గుర్తించలేరు.

NPDలో రకాలు

NPDని మానసిక శాస్త్రవేత్తలు రెండు రకాలుగా విభజించారు. అవి.. ఓవర్ట్ NPD, కోవర్ట్ NPD. ఈ రెండు రకాల్లో లక్షణాలు ఒకేవిధంగా ఉంటాయి. తేడా ఒక్కటే.. మొదటి రకంలో తమ భావాలను ఎదుటి వారితో పంచుకుంటారు. రెండో రకంలో లోలోపలే రహస్యంగా దాచుకుంటారు. ఈ రెండు రకాలను పలు ఉపరకాలుగా విడదీసారు. అవి..

  1. బహిరంగ(గ్రాండియోస్/ఓవర్ట్) నార్సిసిజం: ఇది ఆధిపత్యం, నియంత్రణ-నిర్ధారణ ప్రవర్తన, బహిర్ముఖం, దూకుడు చర్యలు, సున్నితంగా ఉండకపోవడం, అతిశయోక్తితోకూడిన ఆత్మవిశ్వాసం, తమనుతాము గొప్పగా చెప్పుకోవడం, ఇతరుల దృష్టిని ఆకర్షించడం వంటి లక్షణాలుంటాయి. చిన్నతనం నుంచే గ్రాండియోస్ నార్సిసిజం బారిన పడే ప్రమాదాలున్నాయి.
  2. రహస్య(కోవర్ట్) నార్సిసిజం: ఇది కొంత హానికారక లక్షణం. ఈ తరహా నార్సిసిజం బారిన పడ్డవారు ఆందోళన(Anxiety) చెందుతారు. సున్నిత మనస్కులుగా ఉంటారు. తమకుతామో ప్రమోషన్(స్వీయ) చేసుకుంటారు. అది కుదరకపోతే బాధపడుతారు.

వ్యాధి నిర్ధారణ ఇలా..

ఈ మానసిక రుగ్మతను నిర్ధారించడానికి నిర్దిష్టమైన పరీక్షలు లేవు. నిపుణులు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ(NPI) లేదా DSM-5 నిర్వచించిన ప్రమాణాలను ఉపయోగించి, నిర్ధారణ చేస్తారు. NPI అనేది ఒక 40 అంశాలతో కూడిన ప్రశ్నపత్రంలాంటిది. రోగనిర్ధారణకు DSM-5 డయాగ్నస్టిక్ ప్రమాణాలను పాటిస్తారు.

చికిత్స ఎలా?

NPDని థెరపీ ద్వారా రూపుమాపవచ్చు. DSM-5 డయాగ్నస్టిక్ ప్రమాణాల మేరకు చికిత్స అందించాలి. కౌన్సెలింగ్, కాగ్నెటివ్, టాక్ థెరపీల ద్వారా సామాజిక సంబంధాలను పెంపొందించవచ్చు.